కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకుడు మేడిపల్లి సత్యంపై మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మెచినేని నవీన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం, ఎల్లంపల్లి నీటి అంశంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆరోపించారు.
నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగిందని, అందుకే నీటి విడుదల జరుగుతోందని అన్నారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
“కాంగ్రెస్ వాళ్ల అబద్ధాలకు, ఓట్ల కోసం చేసే రాజకీయాలకు భయపడి దేవుడే కరుణించినట్టుగా రాత్రికి రాత్రే వర్షాలు పడ్డాయి. దొంగ ఓట్లతో గెలిచామని ప్రజలు అనుకుంటున్నారనే భయంతోనే ఇప్పుడు కొత్త కథలు చెబుతున్నారు” అని మెచినేని నవీన్ రావు వ్యాఖ్యానించారు.
మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వర్షాల వల్ల ఎల్లంపల్లి నీటిమట్టం పెరిగిందని చెప్పకుండా, దాన్ని తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు వేసి, గిరి ప్రదక్షిణలు చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలతో భక్తుల విశ్వాసాలను కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
“మీకు చేతకాకపోయినా అదృష్టం కలిసి వచ్చి వర్షాలు పడ్డాయని చెప్పుకోవాలి. లేకపోతే ప్రజలు, రైతుల సమస్యలపై మిమ్మల్ని ప్రశ్నించేవారు” అని అన్నారు.
ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటూ వారానికి ఒకసారి వచ్చి కార్యక్రమాలు నిర్వహించి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గర్శకుర్తిని మండలంగా చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదని మెచినేని నవీన్ రావు అన్నారు. హామీ నెరవేర్చకపోతే తనను చెట్టుకు కట్టేయాలని అప్పట్లో మేడిపల్లి సత్యం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు గర్శకుర్తిని మండలంగా ఎందుకు చేయడం లేదని, ఇచ్చిన హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గర్శకుర్తి మండల పరిస్థితిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
కాలేశ్వరం పంపుల అంశంపై స్పందిస్తూ, భారీ వర్షాల కారణంగా సహజంగా వరద నీరు వస్తోందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా పంపుల ఆపరేషన్‌కు సంబంధం లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.
“కేసీఆర్ పంపుల ద్వారా వచ్చిన నీటిని కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగనాటకాలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి” అని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మెచినేని నవీన్ రావు అన్నారు.





