🔹స్వయంగా నీళ్లలోకి దిగి చెత్త తొలగించిన ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్
జనోదయ,కమాన్‌పూర్ జూలై 29 :
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సిద్ధిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి పక్కన ఉన్న కాలువ మత్తడి పైపులైన్లు చెత్తతో మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లక రోడ్డుపైకి చేరింది.
విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ బంగారు కళ్యాణి–మహేష్, ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్, పంచాయతీ కార్యదర్శి జంజర్ల అమల సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్ స్వయంగా వర్షపు నీటిలోకి దిగి పైపులైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. దీంతో నీటి ప్రవాహం సజావుగా కొనసాగి రహదారిపై నిలిచిన నీరు తగ్గడంతో వాహనదారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామపంచాయతీ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు కొనసాగిస్తామని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.





