జనోదయ,కమాన్‌పూర్, సెప్టెంబర్ 21:
కమాన్‌పూర్ మండలం పెంచికల్పేట్ గ్రామ సర్పంచ్ పల్లె మాధవి–నారాయణ దంపతులు సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పెంచికల్పేట్ నుంచి రేపల్లెవాడ వరకు రహదారి నిర్మాణం, మొదటి వార్డులో మద్దెల వాగుపై కల్వర్టు నిర్మాణం, 1, 2వ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.
గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు సహకరించాలని సర్పంచ్ పల్లె మాధవి–నారాయణ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. గ్రామ సమస్యలను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ పల్లె మాధవి–నారాయణ పేర్కొన్నారు.





