ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్కార్యాలయం మండల కేంద్రంలో.. అధికారులు మాత్రం ఇతర ప్రాంతాల్లో!

కార్యాలయం మండల కేంద్రంలో.. అధికారులు మాత్రం ఇతర ప్రాంతాల్లో!

📰 Generate e-Paper Clip

🔹మండల కేంద్రంలో లక్షల రూపాయలు వెచ్చించి నూతన కార్యాలయం నిర్మిస్తే సరిపోతుందా?

🔹హెచ్‌ఆర్‌ఏ తీసుకోవడం మాత్రమే ప్రభుత్వ నిబంధనలను పాటించడం అవుతుందా? లేక ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండటమూ బాధ్యతేనా?

🔹మండల కేంద్రంలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటే ప్రభుత్వం నుంచి 17 శాతం హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందుతున్నారు?

🔹స్థానికంగా నివాసం లేకుండా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు?

 

జనోదయ, పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 25:

కమాన్‌పూర్ మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయం అందుబాటులోకి వచ్చినా.. రెవెన్యూ అధికారులు మాత్రం స్థానికంగా నివాసం ఉండక ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్న అంశం మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోనే నివాసం ఉండాలనే నిబంధనలున్నప్పటికీ వాటి అమలు ఏ మేరకు జరుగుతోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు అద్దె భవనాల్లో కొనసాగిన మండల రెవెన్యూ కార్యాలయానికి ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నూతన భవనం నిర్మించింది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో సోమవారం నుంచి నూతన భవనం నుంచే రెవెన్యూ శాఖ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే కార్యాలయానికి నూతన భవనం సమకూరినా.. ప్రజలకు అవసరమైన సమయంలో అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే మండల కేంద్రంలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తూ 17 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నట్లయితే, ఆ భత్యం ఏ ప్రాతిపదికన చెల్లిస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. సంబంధిత అధికారులు వాస్తవంగా ఎక్కడ నివాసం ఉంటున్నారు? వారికి హెచ్‌ఆర్‌ఏ ఎలా మంజూరవుతోంది? అనే అంశాలపై ఉన్నతాధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు తలెత్తుతాయో చెప్పలేని పరిస్థితి. భూ వివాదాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టం, ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాల్లో అధికారుల తక్షణ స్పందన అవసరమవుతుంది. అలాంటి అత్యవసర సమయంలో మండల కేంద్రంలో అధికారి అందుబాటులో లేకపోతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలన్న ప్రశ్న తలెత్తుతోంది. కనీస సమాచారం కోసం కూడా అధికారులు అందుబాటులో లేకపోతే నూతన కార్యాలయం నిర్మాణం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత అన్నదీ చర్చనీయాంశంగా మారింది.

మండల కేంద్రంలో లక్షల రూపాయలు వెచ్చించి నూతన కార్యాలయం నిర్మిస్తే సరిపోతుందా? కార్యాలయంతోపాటు అధికారులు కూడా ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా? హెచ్‌ఆర్‌ఏ తీసుకోవడం మాత్రమే ప్రభుత్వ నిబంధనలను పాటించడం అవుతుందా? లేక ప్రజలకు అందుబాటులో ఉండటమూ ఉద్యోగ బాధ్యతలో భాగమేనా? స్థానికంగా నివాసం లేకుండా రాకపోకలు సాగిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నూతన కార్యాలయ భవనం ప్రారంభంతో రెవెన్యూ పాలన మరింత ప్రజలకు చేరువ కావాలని, అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవనం మారింది.. ఇక అధికారుల పనితీరులో, ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ మార్పు రావాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular