జనోదయ,పాలకుర్తి ఆగస్టు 23:
రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతు విజ్ఞాన కేంద్రం, పెద్దపల్లి సమన్వయకర్త డాక్టర్ ఓ. సంపత్ పర్యవేక్షణలో శనివారం పాలకుర్తి మండలంలోని మూడు గ్రామాల్లో ఆత్మ పథకం కింద ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు.
కన్నాల గ్రామంలో వరి, పత్తి పంటల్లో జీవ ఎరువుల వినియోగంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. భూమిలో భాస్వరం లభ్యతను పెంచే ఫాస్పరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్‌బీ)ను విత్తన శుద్ధి సమయంలో, అలాగే నేలలో ఎలా వినియోగించాలో శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు. జీవ ఎరువుల వినియోగంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు.
పుట్నూర్ గ్రామంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతిని ముందుగానే గుర్తించేందుకు పసుపు జిగురు అట్టలను ఎలా ఏర్పాటు చేయాలో రైతులకు చూపించి, పలువురు అభ్యుదయ రైతులకు వాటిని ఉచితంగా అందజేశారు. పత్తి మొక్కల్లో అధిక పూత, కాయలు ఏర్పడేందుకు మెపిక్వాట్ క్లోరైడ్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు.

కుక్కలగూడూరు గ్రామంలో నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ ద్రావణాలను డ్రోన్ ద్వారా పత్తి పంటపై పిచికారీ చేసే విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. డ్రోన్ పిచికారీ ద్వారా నీరు, సమయం, కూలీల ఖర్చు గణనీయంగా ఆదా అవుతుందని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ వివరించారు.
ఈ మూడు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సుమారు 45 మంది రైతులు పాల్గొని ఆధునిక సాగు విధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించాలని కుక్కలగూడూరు సర్పంచ్ దేవమ్మ బాపు సూచించారు.
కార్యక్రమాల్లో రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఓ. సంపత్, కుక్కలగూడూరు సర్పంచ్ దేవమ్మ బాపు, ఏఈవోలు ఎం. సువర్ణరేఖ, కే. శ్రీకాంత్, జే. సుష్మతో పాటు పలువురు చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు.





