-మృతదేహంతో భారీ ర్యాలీ – నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్
జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 20
పెట్రోల్ దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కో-ఆర్డినేటర్ అడుప మహేష్ మృతితో ఏనుమాముల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహేష్ మృతదేహాన్ని ఎంజిఎం మార్చురీ నుండి ఎంజిఎం సెంటర్ వరకు తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుడు పత్తి కుమార్ ను ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన అసిస్టెంట్ సీపీ అంకిత్ కుమార్ అక్కడికి చేరుకొని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఎన్టీఆర్ నగర్ కు తరలించారు. బాలాజీ నగర్ సర్కిల్ నుండి ఎన్టీఆర్ నగర్ వరకు కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రధానంగా పాల్గొన్నారు. అలాగే 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అడ్వకెట్ గంధం శివ, డీసీసీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. అడుప మహేష్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. మహేష్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆటో యూనియన్ వారు 30,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రజలు అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మహేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ కు మహేష్ చేసిన సేవలను కొనియాడారు.






