ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లిఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – ఈసాల తక్కలపల్లిలో అవగాహన సదస్సు

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – ఈసాల తక్కలపల్లిలో అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

🔹రైతులకు చెక్కుల పంపిణీ…పంట విస్తరణకు కలెక్టర్ పిలుపు

జనోదయ,పెద్దపల్లి ఏప్రిల్ 8:

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన సదస్సు,సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో ముందంజలో ఉన్న ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు రైతులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఇటీవల కోతకు వచ్చిన పామ్ పంటకు సంబంధించిన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.బామ్లా నాయక్ తండాకు చెందిన భూక్య బాలు నాయక్‌కు రూ.23,920,ఎలకలపల్లి గ్రామానికి చెందిన ఓడ్నాల స్వప్నకు రూ.13,639 చెక్కులను అందజేశారు.రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.

ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో 3-4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు సాధ్యమని,ఒక ఎకరానికి 50 నుంచి 57 మొక్కలు నాటవచ్చని తెలిపారు.ఒక మొక్క ధర రూ.193 కాగా,ప్రభుత్వం కేవలం రూ.20కే అందజేస్తోందని పేర్కొన్నారు.అలాగే డ్రిప్ సాగునీటి సదుపాయం సబ్సిడీపై అందించబడుతుందని,పంట నిర్వహణకు నాలుగు సంవత్సరాల పాటు ఎకరానికి రూ.16,800 వరకు సాయం లభిస్తుందని వివరించారు.

నాలుగో సంవత్సరం నుంచి పంట దిగుబడి ప్రారంభమై 25 నుంచి 30 సంవత్సరాల వరకు లాభాలను ఇస్తుందని తెలిపారు.అకాల వర్షాలు,వడగండ్లు,అడవి జంతువుల ప్రభావం తక్కువగా ఉండటం ఈ పంట ప్రత్యేకతగా పేర్కొన్నారు.ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లాలో త్వరలో తిరుమల ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభం కానుందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,సంస్థ ప్రతినిధులు,గ్రామ ప్రజాప్రతినిధులు,అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమైంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular