🔹సర్పంచ్ భర్త బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని వినతి
జనోదయ,పెద్దపల్లి మార్చి 10:
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన మత్సకారులు తమ జీవనాధారమైన చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు,మత్సకారులు కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
సంఘం ప్రతినిధులు వివరించిన ప్రకారం,1986లో నమోదైన వడ్కాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ప్రస్తుతం సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు.వడ్కాపూర్,వెంకట్రావుపల్లి గ్రామాల చెరువులు సంఘ పరిధిలోకి వస్తాయని,ఈ చెరువులపై ఆధారపడి సంవత్సరాలుగా జీవనోపాధి సాగిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తూ నిబంధనల ప్రకారం చేపల వేట కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే ఇటీవల వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ భర్త మచ్చ యాదగిరి మరియు అతని అనుచరులు చెరువుల్లో చేపలు పట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని మత్సకారులు ఆరోపించారు.చేపలు పట్టాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని,ఇవ్వకపోతే చెరువులో విషం కలిపి చేపలను చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు.దీంతో మత్సకారులు భయభ్రాంతులకు గురవుతున్నారని వాపోయారు.
ఈ నేపథ్యంలో తమ సంఘం హక్కులను పరిరక్షిస్తూ చెరువుల్లో చేపల వేటకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కనకట్ల స్వామి,ఉపాధ్యక్షుడు జెట్టి సతీష్,కార్యదర్శి తీగల రమేష్‌తో పాటు సంఘానికి చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు.మత్సకారుల జీవనాధారాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.





