జనోదయ,పెద్దపల్లి,ఏప్రిల్ 7:
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు రాష్ట్ర స్థాయిలో మరొకసారి ప్రశంసలు అందుకున్నాయి.వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ ఆసుపత్రి రాష్ట్రంలోనే అత్యధిక అవార్డులను సొంతం చేసుకుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ ఈ అవార్డులను స్వీకరించారు.
సూపరిండెంటెంట్ విభాగంలో సమర్థ నిర్వహణతో పాటు అనస్థీషియా నిపుణుడిగా సేవలందించినందుకు ‘ఉత్తమ సూపరిండెంటెంట్’గా తొలి అవార్డు దక్కింది.ఆరోగ్యశ్రీ పథకంలో అత్యధిక కేసులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు రెండవ అవార్డు లభించింది.అలాగే టిహబ్ ఆధ్వర్యంలో అత్యధిక రక్తపరీక్షలు నిర్వహించినందుకు మూడవ అవార్డు అందుకున్నారు.
ఇక రేడియాలజీ విభాగంలో అధిక సంఖ్యలో స్కానింగ్ సేవలు అందించినందుకు డాక్టర్ సంధ్యారాణికి ప్రత్యేక అవార్డు దక్కింది.ఈ విజయాలతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య సేవలలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరిచింది.
వైద్య సిబ్బంది అంకితభావం,సమర్థ నిర్వహణ,రోగుల పట్ల సేవా దృక్పథం ఈ విజయానికి పునాది అని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ అవార్డులు భవిష్యత్తులో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రేరణగా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.





