జనోదయ, కోరుట్ల, మార్చి 15:
కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) జాతీయ స్థాయిలో తృతీయ బహుమతికి ఎంపిక కావడం పట్ల పైడిమడుగు స్పెషల్ ఆఫీసర్, జిల్లా సహకార కార్యాలయ సూపరింటెండెంట్ అసద్ ఆనందం వ్యక్తం చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నుంచి ఉత్తమ సంఘంగా ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు. బ్యాంకింగ్ సేవల కంప్యూటరైజేషన్, సమర్థ నిర్వహణ, సభ్యుల ఆర్థిక ప్రయోజనాల పెంపు, రైతులకు అందిస్తున్న సేవల కారణంగా ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. ఈ నెల 17న సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా తృతీయ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పైడిమడుగు ప్యాక్స్ ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు అందించడం, డిపాజిట్ల సేకరణ, బంగారంపై రుణాలు, ఎరువుల విక్రయాలు, ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు వంటి సేవలు సమర్థవంతంగా అందిస్తున్నామని చెప్పారు. సంఘం పరిధిలోని పైడిమడుగు, జోగినపల్లి గ్రామాల రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని స్పెషల్ ఆఫీసర్ అసద్ తెలిపారు.






