జనోదయ,మంథని ఫిబ్రవరి 8:
ఆదివారం గంగపూరి సమీపంలో మంథని నుంచి సిద్ధపల్లి వైపు సిమెంట్ ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద ఒక కూలీ ఇరుక్కుపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు సంఘటనను గమనించి వెంటనే అక్కడ ఆగారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన క్షణాల్లోనే స్పందిస్తూ సహాయక చర్యలకు ముందుకు వచ్చారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే భారీ యంత్రాన్ని రప్పించి, ట్రాక్టర్ కింద ఇరుక్కున్న కూలీని సురక్షితంగా బయటకు తీసే పనిలో కీలక పాత్ర పోషించారు.
ప్రమాద బాధితుడిని బయటకు తీసిన వెంటనే, ఆయన పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన శ్రీను బాబు వెంటనే మంథని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆసుపత్రిలో తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో కూలీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటనలో రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక సాధారణ మనిషిగా స్పందించిన శ్రీను బాబు చర్యలు అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రమాద సమయంలో ఎవరు లేని చోట ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది. ఈ సంఘటన మానవత్వం ఉంటే రాజకీయ హోదాలు అవసరం లేదన్న భావనను ప్రజల్లో మరింత బలంగా చాటి చెప్పింది.





