🔹ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వైభవంగా నిర్వహణ
జనోదయ,జగిత్యాల, ఫిబ్రవరి 08:
జగిత్యాల జిల్లా జగిత్యాల మండలంలోని బాలపెల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 17, 2026 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
ఫిబ్రవరి 14 శనివారం ఉదయం 11:40 నిమిషాలకు పూర్వాషాడ నక్షత్ర యుక్త మేష లగ్న సుముహూర్తంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగనుంది. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి దీప ప్రజ్వలన, గణపతి పూజ, కలశ స్థాపన, మహారుద్ర అభిషేకం, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ, రాత్రి 8 గంటలకు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆరాధన జరుగుతాయి.
ఫిబ్రవరి 15 ఆదివారం ఉదయం 4 గంటలకు అగ్ని గుండా ప్రవేశం అనంతరం గెలుపు కార్యక్రమం, ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు మహారుద్ర అభిషేకం, నిశీ పూజ, తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది.
ఫిబ్రవరి 16 సోమవారం ఉదయం 9 గంటలకు అన్నపూజ, ఫిబ్రవరి 17 మంగళవారం ఉదయం 6 గంటలకు నిత్య పూజ, ఉదయం 9:40 నిమిషాలకు రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేయనున్నారు.
ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృప పొందాలని ఆలయ కమిటీ కోరింది.





