•బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి
•ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపు
•హామీలకే పరిమితమైన కాంగ్రెస్, ఫలితం లేని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6:
పెద్దపల్లి రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. “మోసకారులకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది… ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి” అంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పెద్దపల్లి ప్రజలకు స్పష్టమైన పిలుపునిచ్చారు.శుక్రవారం పెద్దపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు,పెద్దపల్లి ఎన్నికల ఇంచార్జ్ ఆనంద్ గౌడ్లతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.పెద్దపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు అభ్యర్థి బొల్లం అనిల్‌తో పాటు ఇతర బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజల మధ్యకు వెళ్లారు.
ఈ సందర్భంగా చీకురాయి రోడ్డులో బీజేపీ కార్యాలయాన్ని స్థానిక నాయకులు,కార్యకర్తలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.ప్రజలతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలను గెలిపించి ప్రజలు మోసపోయారని,పదేళ్లపాటు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా అభివృద్ధి ఫలితాలు కనిపించలేదని విమర్శించారు.పాలకులు సొంత లాభాలకే పరిమితమై,పెద్దపల్లికి తగిన న్యాయం చేయలేదన్నారు.
ఇక రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని,మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్లే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు.
“ఇకపై ఈ రెండు పార్టీలకు ఓటేసినా మార్పు ఉండదు.బీజేపీని నమ్మి గెలిపిస్తే కేంద్ర నిధులన్నీ తీసుకొచ్చి, పెద్దపల్లిని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తాం” అని మల్క కొమరయ్య హామీ ఇచ్చారు.అన్ని వార్డులతో పాటు ఛైర్మన్ పీఠం గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.





