జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 12:
పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది.క్రైమ్ నంబర్ 85/2021గా నమోదైన ఈ కేసులో నిందితుడు కొర్లపాటి అరుణ్‌కు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో నిందితుడు కొర్లపాటి అరుణ్ (29),మంఛిర్యాల జిల్లా నస్పూర్ సీసీసీ ప్రాంతానికి చెందినవాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376,417,420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అప్పటి ఎస్.ఐ. ఏ.వెంకటేశ్వర్లు,సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు అయింది.
దర్యాప్తు అనంతరం సేకరించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించగా,ప్రాసిక్యూషన్ తరఫున ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ డోంకెన రవి వాదనలు వినిపించారు.కేసు విచారణలో సమర్పించిన ఆధారాలు,సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.అదనంగా రూ.15,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్.హెచ్.ఓ. ఎస్.వెంకటేశ్,లైజన్ ఆఫీసర్ పి.కోటేశ్వర్ రావు,కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి.శ్రీనివాస్ కేసు పురోగతిలో కీలక పాత్ర పోషించారు.
నిందితుడికి శిక్ష ఖరారు కావడంలో సమన్వయంతో పనిచేసిన పోలీస్ సిబ్బంది,ప్రాసిక్యూషన్ బృందాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
ఈ తీర్పు లైంగిక నేరాలపై చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేస్తోంది.బాధితులకు న్యాయం చేయడంలో న్యాయవ్యవస్థ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందనే సందేశాన్ని ఈ తీర్పు మరోసారి సమాజానికి తెలియజేసింది.





