ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణత్వరలో ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికల ప్రకటన?

త్వరలో ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికల ప్రకటన?

📰 Generate e-Paper Clip

🔹రాష్ట్ర రాజకీయాల్లో మరో హైటెన్షన్ దశ

🔹15–20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన

🔹15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కీలక నిర్ణయం

🔹పరీక్షల షెడ్యూల్ మధ్య ఎన్నికల సవాల్…

జనోదయ,హైదరాబాద్ ఫిబ్రవరి 17:

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం ప్రారంభంకానుందా? ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల భర్తీపై ప్రభుత్వం చురుగ్గా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన దిశానిర్దేశం వెలువడే అవకాశముంది.

మున్సిపల్ ఎన్నికల ఉత్సాహం తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే యంత్రాంగంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ఎన్నికల అనంతరం అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించవచ్చని భావిస్తున్నారు.

అయితే ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ నేపథ్యంలో ఎన్నికల తేదీల ఖరారు సవాల్‌గా మారింది. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను నిర్ణయించే అంశంపై విద్యాశాఖ, ఎన్నికల అధికారులతో విస్తృతంగా చర్చించనున్నారు. వారి నివేదిక ఆధారంగా ఎన్నికలు వెంటనే నిర్వహించాలా? లేక పరీక్షల అనంతరం జరపాలా? అన్నది తేలనుంది.

రాష్ట్రంలో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిని త్వరితగతిన భర్తీ చేస్తే 15వ ఆర్థిక సంఘం కింద పెండింగ్‌లో ఉన్న సుమారు 500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై అధికారిక ప్రకటన కోసం రాజకీయ వర్గాలు, స్థానిక నాయకత్వం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular