జనోదయ,మంథని,ఫిబ్రవరి 20:
పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి మరోసారి బహిర్గతమైంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుకూలంగా పూర్తి చేయాలంటే రూ.16,500 ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగేబలంగా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు పన్నిన పన్నాగం ఫలించింది. సాయంత్రం 3.35 గంటల సమయంలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా లంచం స్వీకరించిన వెంటనే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వీకరించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా సేవలో నిబద్ధతకు బదులు అక్రమ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
అవినీతిపై రాజీ లేకుండా పోరాడాలని, లంచం డిమాండ్ ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.





