🔹ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు స్పందన
🔹‘హద్దులు దాటితే సహించం’ – బీఆర్ఎస్ నేతలకు మంత్రి హెచ్చరిక
🔹అభివృద్ధిపై చర్చకు రండి – తక్కళ్లపల్లికి పొన్నం సవాల్
జనోదయ,హుస్నాబాద్ ఫిబ్రవరి 8:
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఇన్చార్జ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ హద్దులు దాటితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా హెచ్చరించారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ఈ ప్రాంతాన్ని తెలియని వారు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదు.స్థానిక ఎమ్మెల్యేలను, నాయకులను తక్కువ చేసి మాట్లాడితే సహించం” అని ఘాటుగా స్పందించారు.రాజకీయ విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుందని,ఆ హద్దులు దాటితే తగిన సమాధానం తప్పదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ తక్కళ్లపల్లి చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. “దమ్ముంటే హుస్నాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రండి” అంటూ ఆయన సవాల్ విసిరారు. తాను భయపడే వ్యక్తిని కాదని,తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తినని గుర్తుచేశారు.
మొత్తంగా ఈ పరిణామం హుస్నాబాద్ ఎన్నికల ప్రచారానికి కొత్త మలుపు తిప్పింది.అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమవుతుండటంతో,రాబోయే రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.





