📰 Generate e-Paper Clip

🔹అభివృద్ధే అజెండాగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఎన్నికల ప్రచారం

 

జనోదయ,ఫిబ్రవరి 2:(పడాల వంశీ) పెద్దపల్లి ప్రతినిది

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 12, 29, 31వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శాసనసభ్యుడు చింతకుంట విజయరమణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారానికి ముందు సాగర్ రోడ్డులోని కంచేర భావి సమీప హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి దొడ్డుపల్లి జగదీష్, 29వ వార్డు నుంచి ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి, 31వ వార్డు నుంచి మంథని నర్సింగ్‌లను కౌన్సిలర్లుగా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే పట్టణానికి మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గత పాలకులు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, జీరో వడ్డీ రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, సన్న వడ్ల బోనస్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, కొత్త కోర్టు భవనం, 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు విస్తరణ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి సదుపాయాలు కల్పించినట్టు వివరించారు. గత రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌలిక వసతుల పనులు పూర్తి చేసినట్టు చెప్పారు.

పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్త ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్‌రూం ప్రాంతంలో మరో ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.62.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పారు. మొత్తం రూ.77.50 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణకు రూ.7.5 కోట్లు కేటాయించామని, క్రీడల ప్రోత్సాహానికి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఏర్పాటుకు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.2.5 కోట్లు వినియోగిస్తున్నామని తెలిపారు. పట్టణ శివారు ప్రాంతాల అభివృద్ధికీ ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

పెద్దపల్లి ప్రజలు చైతన్యవంతులని, అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here