డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 23:
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ సమావేశాలలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం కింద కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షతను ప్రదర్శిస్తుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు.
దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ అధ్యక్షతన హనుమకొండ విద్యుత్ గెస్ట్ హౌస్ లో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ బడ్జెట్ కేటాయింపులు ఖర్చులపై శ్వేత పత్రం ప్రకటించాలని, అంబేద్కర్ అభయాస్తం పథకాన్ని ప్రారంభించాలని, చేవెళ్ల డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ముఖ్య అథిదిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025- 26 బడ్జెట్లో దళితుల ప్రత్యేక నిధి కింద 40,231 కోట్లు కేటాయించగా కేవలం 16, 374 కోట్లు మాత్రమే విడుదల చేయగా 6,726 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.
బడ్జెట్ కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమైనావని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభిస్తామని 12 లక్షలు కేటాయిస్తామని చెప్పినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసిన పాపానికి పోలేదన్నారు.
స్వయం ఉపాధి ఆర్థిక పథకాలు అమలుగాక నిరుద్యోగ యువత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి లేక ఇబ్బందుల పాలవుతుందన్నారు. ఎస్సీల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లను పెంచుతామని హామీ సైతం మరిచారని విమర్శించారు. ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 17,154 కోట్లు కేటాయించి కేవలం 3,431 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
గత వారం రోజుల క్రితం బంజారా భవన్లో జరిగిన సేవాలాల్ జయంతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ సంక్షేమ విధానాన్ని మార్చుకుందని ఇక సంక్షేమ పథకాలు అమలు చేయమని, భూములు పంచమని చెప్పడం గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రి మాటలు నిజమేనని రుజువు అవుతుందన్నారు.
ఎస్సీ ఎస్టీల రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం బడ్జెట్ నిధుల కేటాయింపు ఖర్చులకోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని శంకర్ ప్రజాసంఘాలను కోరారు. ఎస్సీఎస్టి అత్యాచార బాధితులకు నష్టపరిహారము పునరావసం కల్పించడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్షాన్ని వివక్షితను ప్రదర్శిస్తుందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం వెంటనే పెన్షన్లను పెంచుతూ జీవో జారి చేయాలని పెన్షన్ల కోసం దరఖాస్తు తీసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్,
ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి,
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్, కేయూ జాక్ చైర్మన్ డాక్టర్ మంద వీరస్వామి,
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అంకేశ్వరపు రామచందర్ రావ్, గోసంగి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుంచు మల్లయ్య, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ముల కరుణాకర్,జిల్లా ఉపాధ్యక్షురాలు బౌతు రాధ, నాయకులు రమ,బాగ్య,గాజుల రాజు తదితరులు పాల్గొన్నారు.





