ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణజగిత్యాలడబ్బున్నోడికే బి–ఫారం…

డబ్బున్నోడికే బి–ఫారం…

📰 Generate e-Paper Clip

డబ్బున్నోడికే బి–ఫారం

ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు నిరాశ, కన్నీరు

జనోదయ,జగిత్యాల, ఫిబ్రవరి 04

ఒక్కో కౌన్సిలర్ టికెట్‌కు మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే జాతీయ పార్టీలో కాసుల పందెం నడుస్తోందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బి–ఫారమ్ కోసం ఎదురుచూసిన సెకండ్ క్యాడర్ నాయకులు, పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాసుల కోసమే టికెట్లు అమ్ముకున్నాడని పార్టీకి చెందిన పలువురు నాయకులు స్పష్టంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ధనమే ప్రధాన అర్హతగా మారిందని, అధికారానికి జెండా మోసిన వారికీ కాదు… జేబులు నిండుగా ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారని జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీలకు చెందిన నాయకులు మండిపడుతున్నారు. పైసలున్నవారికే సభ్యత్వం, పదవులు అన్న పరిస్థితి తీసుకువస్తున్నారని జిల్లా అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నారు.
కౌన్సిలర్ టికెట్ కావాలంటే అభ్యర్థి ఆర్థిక స్థితిని బట్టి ₹3 లక్షల నుంచి ₹10 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని నిఖార్సయిన కార్యకర్తలు చెబుతున్నారు. కాసులిచ్చిన వారికే పార్టీ బి–ఫారమ్ అందించారని, ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది.
పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా జిల్లా అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పార్టీ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.
బల్దియా ఎన్నికల్లో ఆశావహులు నామినేషన్లు వేసి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. డబ్బులు ఇస్తేనే టికెట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది పార్టీకి మచ్చగా మారుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా, పార్టీలకు కట్టుబడి ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడం అన్ని పార్టీల్లోనూ మింగుడు పడని అంశంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular