janodaya.in
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 12:13 pm Digital Edition : JANODAYA MEDIA

పాలితం శివారులో ఉద్రిక్తత – మట్టితవ్వకాలపై మండి పడ్డ ప్రజలు

 🔹టిప్పర్లను నిలిపివేసిన గ్రామప్రజలు

🔹ఉపాధి హామీ పనులపై ముప్పు – కూలీల తీవ్ర నిరసన

 

జనోదయ,పెద్దపల్లి ఏప్రిల్ 11:

పెద్దపల్లి మండలం పాలితం గ్రామ రెవెన్యూ శివారులో మట్టి త్రవ్వకాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.జీవనాధారంగా భావిస్తున్న ఉపాధి హామీ పనుల ప్రాంతంలోనే మట్టి తరలింపులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు,కూలీలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిప్పర్లను అడ్డుకున్నారు.

గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ప్రదేశాన్నే లక్ష్యంగా చేసుకుని మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇలా గుట్టలను త్రవ్వివేస్తే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పేదల జీవనాధారంపై మోపిన ఈ భారం అన్యాయమని వారు మండిపడ్డారు.

అనుమతులు ఉన్నాయా?నియమాలు పాటించబడుతున్నాయా?అనే ప్రశ్నలు ఈ ఘటనతో ముందుకు వచ్చాయి.స్థానికంగా జరుగుతున్న ఈ చర్యలపై సంబంధిత శాఖల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

తక్షణమే మట్టి త్రవ్వకాలను నిలిపివేసి,ఉపాధి హామీ పనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు హెచ్చరికలు జారీ చేశారు.ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడింది.