జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 21:
పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ‘టెక్నో స్పార్క్–2కే26’ పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. దేశ రక్షణ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి (మాజీ డైరెక్టర్–డిఎంఆర్ఎల్,డిఆర్డిఓ; బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రధాన సలహాదారు) ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రాజెక్ట్ ప్రదర్శనను ఆరంభించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శిస్తూ సదస్సులో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు,నగదు బహుమతులు అందజేశారు.
డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,పాఠ్యపుస్తకాలకే పరిమితమవకుండా సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగితేనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అన్నారు. యువ ఇంజనీర్లు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. జాతీయ స్థాయి పరిశోధన పత్రాలను సమీకరించి ప్రచురించడం ద్వారా విద్యార్థుల ఆలోచనలకు విశాల వేదిక కల్పిస్తున్నామని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ అకాడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపల్, విభాగాధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.సాంకేతిక రంగంలో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు నాంది పలికిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.