janodaya.in
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 7:19 pm Digital Edition : JANODAYA MEDIA

ప్రణాళికాబద్ధమైన చదువుతోనే విజయం : డీఈవో శారదా

🔹పెద్దపల్లిలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ–అవగాహన తరగతులు

🔹షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపు

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 9:

పదవ తరగతి విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో,క్రమశిక్షణతో,ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి శారదా స్పష్టం చేశారు.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ – అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల సమీకృత వసతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.జిల్లాలోని అన్ని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి బాలికలు,బాలురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం,చదువుపై స్పష్టత కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా సాగింది.

ఈ సందర్భంగా డీఈవో శారదా మాట్లాడుతూ,పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక అభ్యసన ప్రణాళికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీ చదువు, పునశ్చరణ, స్వీయ మూల్యాంకనం వంటి అలవాట్లు పెంపొందించుకుంటే మంచి మార్కులు సాధించడం సులభమవుతుందన్నారు. పరీక్షలను భయంగా కాకుండా అవకాశంగా భావించాలని విద్యార్థులకు సూచించారు.

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మండల రవీందర్ మాట్లాడుతూ,క్రమశిక్షణ,ఏకాగ్రత,మంచి అలవాట్లతో చదివితే విజయం తప్పదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సహాయ అధికారులు శ్రావణ్ కుమార్ (పెద్దపల్లి),వెంకటస్వామి (మంథని),అలాగే అన్ని వసతి గృహాల సంక్షేమ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన ఈ కార్యక్రమం పరీక్షల ముందస్తు సిద్ధతకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమైన అడుగుగా నిలిచింది.