🔹జిల్లా కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజేహెచ్-143 ప్రతినిధుల వినతి
జనోదయ పెద్దపల్లి ప్రతినిధి, జులై 27:
పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో రాయితీ విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 జాతీయ కౌన్సిల్ సభ్యుడు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు అంకరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు.
సోమవారం టీయూడబ్ల్యూజేహెచ్-143 ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 500 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు, మరో 200 మంది నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరి పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో జర్నలిస్టుల ఇద్దరు పిల్లల్లో ఒకరికి పూర్తి ఉచిత విద్య, మరొకరికి 50 శాతం ఫీజు రాయితీ అందించే విధానం అమల్లో ఉండేదని గుర్తుచేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి జర్నలిస్టుల ఇద్దరు పిల్లలకూ పూర్తి ఉచిత విద్య అందించే అవకాశాన్ని ప్రభుత్వం, సంబంధిత విద్యాసంస్థలు పరిశీలించాలని కోరారు.
వారి విజ్ఞప్తిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్య అందించే అంశంపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్‌గా జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తున్న కోయ శ్రీహర్షకు జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే రెండు విడతల్లో సుమారు 450 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసినట్లు పేర్కొంటూ, మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు కొనసాగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తిర్రి తిరుపతి గౌడ్, కత్తెర్ల తిరుపతి యాదవ్, అర్కుట మల్లేష్ యాదవ్, కొయ్యడ తిరుపతి యాదవ్, మేకల సంతోష్, చేగొండ రవికుమార్ యాదవ్, మాచర్ల వంశీ, తిర్రి సుధాకర్ గౌడ్, సుంకే రాజు, నల్లపు తిరుపతి, మార్పాక అంజి, తూర్పాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.