janodaya.in
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 3:54 pm Digital Edition : JANODAYA MEDIA

ఎన్నికల వరకు అధ్యక్షుడిగానే కొనసాగుతా

🔹తొలగింపు తీర్మానం చెల్లదన్న న్యాయస్థానం

🔹బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 17:

పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు తీసుకుంది.ఎన్నికలు జరిగే వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ స్పష్టం చేశారు.ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

గత 25 సంవత్సరాలుగా న్యాయవాదిగా సేవలందిస్తున్న తాను బార్ అసోసియేషన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించానని పేర్కొన్నారు.ఆరు సార్లు కార్యదర్శిగా,మూడుసార్లు వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికైన తాను 2025–26 సంవత్సరానికి కూడా అధ్యక్షుడిగా ఎన్నికై విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.అయితే కొందరు సీనియర్ న్యాయవాదుల ప్రేరణతో నిబంధనలకు విరుద్ధంగా తనపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారని ఆరోపించారు.

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా,స్పష్టమైన వివరణ కోరకుండా సభ్యత్వం రద్దు చేసి అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారని తెలిపారు.ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్‌ను ఆశ్రయించగా,ఆ కౌన్సిల్ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి తన తొలగింపును కొట్టివేసిందన్నారు.అదనంగా,భారత బార్ కౌన్సిల్ తాత్కాలికంగా ఆ తీర్పును నిలిపివేసినప్పటికీ,దానిపై హైకోర్టును ఆశ్రయించగా ఫిబ్రవరి 11న హైకోర్టు భారత బార్ కౌన్సిల్ తాత్కాలిక ఉత్తర్వులను రద్దు చేసి తాను అధ్యక్షుడిగానే కొనసాగాలని స్పష్టం చేసిందని వివరించారు.

హైకోర్టు తీర్పుతో తనకు న్యాయం జరిగిందని,ఇకపై ఎవరైనా అక్రమ చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు ఆయనకు మద్దతుగా హాజరయ్యారు.

బార్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న ఈ పరిణామాలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎన్నికల వరకు నాయకత్వంపై స్పష్టత రావడంతో సభ్యుల్లో కొంత స్థిరత్వం నెలకొననుందని భావిస్తున్నారు.