janodaya.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:37 pm Digital Edition : VAMSHI PADALA

గ్రామాభివృద్ధి దిశగా సర్పంచులకు మార్గదర్శనం – ఐదు రోజుల శిక్షణ విజయవంతం

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 24:

పెద్దపల్లి పట్టణంలోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన రెండో దశ ఐదు రోజుల ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అంతర్గాం,ధర్మారం,ఎలిగేడ్,జూలపల్లి,మంథని,ముత్తారం(మంథని)మరియు రామగిరి మండలాలకు చెందిన సర్పంచులు ఈ శిక్షణలో పాల్గొని పంచాయతీ పరిపాలనపై సమగ్ర అవగాహన పొందారు.

ముగింపు సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు కోర్సు పూర్తి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సర్పంచ్ పదవి ప్రజల విశ్వాసానికి ప్రతీక అని,రాబోయే ఐదేళ్లలో గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.ప్రజల సమస్యలను వినిపించి సమయానుకూలంగా పరిష్కరించడమే నిజమైన ప్రజాసేవకుని లక్షణమని అన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి వీరబుచయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో డీఎల్పీఓ దేవకీదేవి,డీఎల్పీఓ కోమురయ్యతో పాటు శిక్షకులు,మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.పంచాయతీ చట్టాలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు,ప్రభుత్వ పథకాల నిర్వహణ వంటి అంశాలపై సర్పంచులకు స్పష్టమైన దిశానిర్దేశం అందించబడింది.ఈ శిక్షణ గ్రామ పాలనను మరింత సమర్థవంతంగా మార్చే పునాది అవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.