janodaya.in
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:42 am Digital Edition : VAMSHI PADALA

ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఘనోత్సవం

🔹అంగరంగ వైభవంగా సాగిన శివరాత్రి వేడుకలు

🔹చిన్నారుల నృత్యాలతో కనువిందు చేసిన శివరాత్రి వేడుకలు

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16:

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కమాన్‌పూర్ మార్కెట్ ఏరియాలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాలు భక్తి,సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగి స్థానికులను ఆకట్టుకున్నాయి.

 

పవిత్ర వేడుకలలో భాగంగా ఆర్కెస్ట్రా భక్తి గీతాలతో సభను పరవశింపజేసింది.శ్రీ శారద నృత్య కళాపీఠం ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక,సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారుల భావవ్యక్తీకరణ,లయబద్ధత,వేదికపై ఆత్మవిశ్వాసం సభలో చప్పట్ల వర్షం కురిపించింది.శివతాండవ నృత్యాలు ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించాయి.

యువసేన ఏర్పాటుచేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ కార్యక్రమాలకు ప్రత్యేక శోభను తెచ్చింది.వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రత్యేక ప్రసంగాలు,భక్తి ప్రదర్శనలు కుటుంబ సమేతంగా హాజరైన ప్రజలను ఆకట్టుకున్నాయి.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి వైభవమైన ఉత్సవాలు నిర్వహించడం యువసేన ప్రత్యేకతగా మారిందని,సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం,సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యమని యువసేన అధ్యక్షుడు మల్యాల శేఖర్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో యువసేన వ్యవస్థాపకులు జంగపెల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు కొత్తపల్లి సతీష్,గుంజపడుగు నరేష్,యువసేన నాయకులు అలాగే వివిధ పార్టీల నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.