janodaya.in
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 6:41 pm Digital Edition : JANODAYA MEDIA

గడ్డిమందు విషతుల్యానికి గోల్డెన్ అవర్ కీలకం : 4–5 గంటల్లో ఆసుపత్రికి తీసుకురండి

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 14:

పారాక్వాట్‌గా పిలువబడే గడ్డిమందు సేవించిన వారిని 4 నుంచి 5 గంటల్లోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్ తెలిపారు.పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గతంలో ఎండోసల్ఫాన్ వంటి పురుగుమందులు సేవించిన సందర్భాల్లో విరుగుడు అందుబాటులో ఉండటంతో బాధితులను ఎక్కువ శాతం కాపాడగలిగామని చెప్పారు.అయితే ఇటీవలి కాలంలో గడ్డిమందు సేవించే ఘటనలు పెరిగాయని,దానికి ప్రత్యక్ష విరుగుడు లేకపోవడం పరిస్థితిని క్లిష్టం చేస్తోందన్నారు.అయినా సరైన సమయంలో సరైన దశల్లో చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు.

మెడికవర్‌లో ఇప్పటివరకు గడ్డిమందు సేవించిన సుమారు 200 మందికి చికిత్స అందించగా 52 మందిని కాపాడగలిగామని వెల్లడించారు.అధునాతన ఫిల్టర్లు,ప్రత్యేక వైద్య పద్ధతులతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.బాధితులను తరలించే సమయంలో ఆక్సిజన్ ఇవ్వకూడదని,అది ఊపిరితిత్తుల్లో రసాయన ప్రభావాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అదే సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను “స్టోన్‌బెల్ట్”గా పేర్కొంటూ కిడ్నీ రాళ్ల సమస్యపై కూడా వైద్యులు అప్రమత్తం చేశారు.షుగర్,రక్తపోటు ఉన్నవారు నడుం నొప్పిని తేలికగా తీసుకోవద్దని సూచించారు.పెయిన్ కిల్లర్ల అధిక వినియోగం కిడ్నీలను దెబ్బతీస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో వైద్య బృందం పాల్గొని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించింది.సమయానికి చికిత్సే ప్రాణరక్షణకు కీలకమన్న సందేశాన్ని వైద్యులు స్పష్టం చేశారు.