నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు\
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసుల నిఘా
జనోదయ , గంగాధర, అక్టోబర్ 31:
గంగాధర మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా శనివారం పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణ సమక్షంలో మధురానగర్ ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి వాటి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
