జనోదయ,రామగిరి ఫిబ్రవరి 10:
మంగళవారం అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.డైరెక్టర్ ఇఅండ్‌ఎం యం.తిరుమలరావు గనిని సందర్శించి ఉత్పత్తి మరియు భద్రతా అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
తదుపరి సమావేశంలో గనిలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు డైరెక్టర్‌కు వివరించారు.ముఖ్యంగా లాంగ్‌వాల్ మూడో ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి అలాగే నాలుగో ప్యానెల్ తయారీ పనులపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ సాల్వేజింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లాంగ్‌వాల్ నుంచి భద్రతతో కూడిన ఉత్పత్తిని నిరంతరం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఇందుకు అవసరమైన సాంకేతికపరమైన మరియు నిర్వహణపరమైన నిర్ణయాలు సమయానికి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం గనిలోని సీఓ–2,ఎన్–2 ఫ్లషింగ్ ప్లాంట్లను డైరెక్టర్ పరిశీలించి వాటి పనితీరుపై అధికారులతో చర్చించారు.భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య,ఎస్వోటు జీఎం బండి సత్యనారాయణ,ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.జనార్దన్,ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం,మేనేజర్ పెంచలయ్య,సర్వే అధికారి హన్మండ్లు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.మొత్తం మీద ఈ పర్యటన గనిలో భద్రతతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలకంగా నిలిచింది.