janodaya.in
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 7:22 pm Digital Edition : VAMSHI PADALA

పెద్దపల్లి బాలసదన్ హాస్టల్‌లో చిన్నారులకు అస్వస్థత – 32 మంది ఆసుపత్రిలో చేరిక

🔹వెంటనే స్పందించిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 12:

పెద్దపల్లిలోని బాలసదన్ బాలల గృహంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఆరోగ్య ఘటన కొద్దిసేపు ఆందోళనకు గురిచేసింది.వాంతులు,కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 32 మంది చిన్నారులను రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జిల్లా సంక్షేమ అధికారుల సమన్వయంతో ఈ తరలింపు వేగంగా జరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ముందస్తు సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర విభాగాన్ని సిద్ధం చేశారు.డాక్టర్ల బృందం,స్టాఫ్ నర్సులు సమన్వయంతో పని చేయడంతో పిల్లలకు వెంటనే చికిత్స అందింది.చికిత్స ప్రారంభమైన రెండు గంటల్లోనే చాలా మంది చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది.వైద్యుల సమయస్ఫూర్తి పరిస్థితిని అదుపులోకి తెచ్చిందని చెప్పవచ్చు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ వివరాల ప్రకారం,32 మంది చిన్నారుల్లో 28 మందిని గురువారం ఉదయం దఫాలవారీగా డిశ్చార్జ్ చేశారు.మిగిలిన నలుగురు పిల్లలు పరిశీలనలో ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందన్నారు.అవసరమైన రక్తపరీక్షలు,స్కానింగ్‌లు నిర్వహించినట్లు తెలిపారు.వైద్యపరంగా ఎలాంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.

చికిత్స పొందుతున్న నలుగురిని కూడా శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.ఈ ఘటనతో కొంతసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆసుపత్రి అధికారులు భరోసా ఇచ్చారు.

ఇక ఘటనపై బాలసదనం నిర్వహకులు లేదా జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.మొత్తం మీద,సమయానికి అందిన వైద్య సేవల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.