janodaya.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 10:03 am Digital Edition : VAMSHI PADALA

ఆపదలో ఉన్న మహిళకు అండగా ఛత్రపతి శివాజీ యువసేన – ముగ్గురు యువకుల రక్తదానం

జనోదయ,కమాన్‌పూర్ మార్చి 13:

ఆపదలో ఉన్నవారికి వెంటనే సహాయం చేయాలనే మానవత్వాన్ని చాటుతూ ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు మరోసారి సేవా భావాన్ని ప్రదర్శించారు. దేవరం పల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల రాజేశ్వరి మెదడు ట్యూమర్ శస్త్రచికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా రక్తం అవసరమైంది.

ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేసి బాధితురాలికి అండగా నిలిచారు. ఒకేసారి ముగ్గురు యువకులు కలిసి రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది.

రక్తదాతలుగా కొడపర్తి వినీత్, మహేష్, శ్రీకాంత్ ముందుకు వచ్చి సేవాభావాన్ని చాటుకున్నారు. వీరిలో కొడపర్తి వినీత్ ఇప్పటివరకు 22 సార్లు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యువసేన సభ్యుల సేవా స్పూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు మల్యాల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ,రక్తదానం మహాదానం అని, ఒకరి ప్రాణాలను కాపాడే గొప్ప సేవగా భావించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేయండి – ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి” అనే సందేశాన్ని యువసేన సభ్యులు మరోసారి ప్రజలకు గుర్తు చేశారు.