గంగాధర, జూలై 28: చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు వెంటనే వరదకాల్వ, నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి నిర్వహించిన “రైతాంగం కోసం రవిశంకర్” నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమం పేరుతో పాదయాత్రలు, హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించి, అన్నారం–సుందిళ్ల–ఎల్లంపల్లి మార్గం ద్వారా మిడ్ మానేరు, వరదకాల్వలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరదకాల్వ జీవనదిలా ప్రవహించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని, ప్రస్తుతం చుక్క నీరు లేక దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాల్వపై ఆధారపడి సాగు చేసే రైతులు మోటార్లు నడపలేక పొలాలను పడావుగా వదిలే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కుడి, ఎడమ కాల్వల పనులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
చొప్పదండి ప్రాంతాన్ని మరోసారి ఎడారిగా మార్చే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని, రైతుల సంక్షేమం గురించి చెప్పే నాయకులు కేవలం ఫ్లెక్సీలు, బ్యానర్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అందిన సాగునీటిని తిరిగి పునరుద్ధరించాలని, వెంటనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే రానున్న రోజుల్లో మూడు జిల్లాల కలెక్టరేట్లను ముట్టడి చేసి రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సుంకె రవిశంకర్ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.