janodaya.in
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 10:14 am Digital Edition : JANODAYA MEDIA

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా గాయత్రి కళాశాలలో బోనాలు–గోరింటాకు సంబరాలు

జనోదయ, పెద్దపల్లి జూలై 31:

పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగతో పాటు గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో సాంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థినులు, అధ్యాపకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లెంకి రజిని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, వైభవోపేతమైన జానపద పండుగ అని పేర్కొన్నారు. అమ్మవారికి అన్నం, పెరుగు, బెల్లం తదితర నైవేద్యాలతో బోనం సమర్పించడం ద్వారా భక్తి, కృతజ్ఞతలను చాటుకుంటారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లడం ఈ పండుగ విశిష్టత అని వివరించారు.
అదేవిధంగా గోరింటాకు మహిళల సంప్రదాయ సంస్కృతిలో విడదీయరాని భాగమని, ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు అలంకరించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా ఆనందం, శుభానికి ప్రతీకగా భావిస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ స్వయంగా గోరింటాకు రుబ్బి విద్యార్థినులు, అధ్యాపకులకు గోరింటాకు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాలు, గోరింటాకు సంబరాలను ఉత్సాహంగా జరుపుకోవడంతో కళాశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.