తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన రేవంత్ సర్కార్ – బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌పై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేదిగా కాకుండా, కాంట్రాక్టర్లకు మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన బడ్జెట్‌గా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, “గుండు సున్నా, గాడిద గుడ్డు” లాంటి బడ్జెట్‌గా లాగా కనబడుతుందన్నారు.
ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, సాగు చేసుకోవడానికి నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఆ సమయంలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ప్రతి బడ్జెట్ భారీగా ఉండేదని, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపొందించేవారని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 2026–27 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం రూ. 23,179 కోట్లు మాత్రమే కేటాయించడం రైతుల పట్ల అన్యాయం అని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులుగా చేయాలనే లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వెనక్కి నెట్టిందని అన్నారు.
రైతు భరోసా విషయంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. ఎకరానికి రూ.12,000 ఇస్తామని చెప్పినా, బడ్జెట్ కేటాయింపులు చూస్తే రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వడం కూడా సాధ్యం కాదని అన్నారు. కౌలు రైతులకు ఇచ్చే డబ్బులు, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు చేయడం అసాధ్యమని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేది కాకుండా అప్పుల వైపు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ. 3.27 లక్షల కోట్లు పెట్టారని, అందులో ఎక్కువ భాగం అప్పులేనని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న అప్పులపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల్లోనే భారీగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇంకా మిగిలిన కాలంలో తెలంగాణ ప్రజలపై మరింత అప్పు భారం పడే ప్రమాదం ఉందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినా అభివృద్ధి కోసం చేశారని ఆయన అన్నారు. కొత్త సచివాలయం, కాలేశ్వరం ప్రాజెక్ట్, అంబేద్కర్ విగ్రహం, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు, రోడ్లు, బ్రిడ్జిలు, కాల్వలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు వంటి అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పెద్ద అభివృద్ధి పనులు ఏవీ చేయడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయాన్ని కూడా సుంకే రవిశంకర్ ప్రస్తావించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, వాటికి చట్టబద్ధత తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ గ్యారెంటీలకు చట్టబద్ధత ఇవ్వలేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఇచ్చిందని చెప్పినా, వాస్తవంగా ఇప్పటి వరకు ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఇవ్వాలని ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఇచ్చిన హామీలపై నిజాయితీ ఉంటే ఆ ప్రైవేట్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఇక నారాయణపూర్ రిజర్వాయర్ విషయంపై కూడా ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనే దాదాపు రూ. 2000 కోట్లు ఖర్చు చేసి నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేశామని తెలిపారు. మంగపేట మరియు నారాయణపూర్ ప్రాంతాల్లో నిర్వాసితులకు పరిహారం కూడా ఇచ్చామని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. త్వరలోనే నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
కాల్వల పనులు పూర్తికాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కాల్వలు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని, పనులు మాత్రం జరగడం లేదని అన్నారు.
ప్రస్తుతం కొందరు నాయకులు అభివృద్ధి పనులు చేయకుండా అపర భగీరథుడు అని ఫ్లెక్సీలు, రీల్స్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పని చేసి చెప్పుకుంటే తప్పు లేదని, కానీ పని చేయకుండా ప్రచారం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేస్తారని, ప్రచారం కోసం కాదు అని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఇంకా రెండున్నర సంవత్సరాల పాలన మిగిలి ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. ప్రజలు గెలిపించినందుకు వారికి న్యాయం చేసే విధంగా పాలన సాగించాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, మూడో బడ్జెట్ కూడా ప్రజలకు ఉపయోగపడేదిగా లేదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.