janodaya.in
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:19 pm Digital Edition : JANODAYA MEDIA

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పెద్దపల్లి పోలీసులు

•వాహన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన గంజాయి అక్రమ రవాణా

•807 గ్రాముల గంజాయి స్వాధీనం – ఇద్దరు యువకుల అరెస్ట్

 

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 2:(పడాల వంశీ)

పెద్దపల్లి పట్టణంలో పోలీసులు చేపట్టిన సాధారణ వాహన తనిఖీలు మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టును బయటపెట్టాయి. పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన చెకింగ్‌లో, గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు యువకులు పోలీసుల వలలో చిక్కారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గంజాయి సేవనానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు నాగపూర్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం దానిని అధిక ధరలకు విక్రయించేందుకు ఆటోలో కరీంనగర్ దిశగా తరలిస్తుండగా, అప్రమత్తంగా ఉన్న పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుబడ్డవారిని కరీంనగర్‌కు చెందిన ఖాజా బషిరుద్దిన్ (24), తండ్రి ఖాజా మొయినుద్దిన్, నివాసం శాంతినగర్–చింతకుంట మరియు షోయబ్ అక్తర్ (23), తండ్రి సయ్యద్ ఖలీల్, నివాసం ఖార్ఖానగడ్డగా గుర్తించారు.

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన 807.52 గ్రాముల ఎండు గంజాయితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన బజాజ్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ, ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలను గమనించి పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు–ప్రజల సమన్వయంతోనే మత్తు పదార్థాల ముప్పుకు పూర్తిస్థాయి అడ్డుకట్ట వేయగలమని వారు తెలిపారు.