janodaya.in
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 10:15 am Digital Edition : VAMSHI PADALA

భక్తుల జయజయధ్వానాల మధ్య చత్రపతి శివాజీ యువసేన దుర్గాదేవి శోభాయాత్ర

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 23:

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మహాశక్తి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి భవ్య శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు.

దుర్గాదేవి శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ హారతి, ట్రాన్స్‌లైటింగ్‌ ప్రదర్శనలు, ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డోలు వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగిన శోభాయాత్రతో కోదండపురం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

గత 12 ఏళ్లుగా నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా శ్రీ మహాశక్తి దుర్గాదేవి కొలువుదీరడం విశేషం. ప్రతి సంవత్సరం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు యువసేన సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతోపాటు, ఐకమత్యాన్ని చాటిచెప్పాయి.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు మల్యాల శేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల విజయానికి సహకరించిన భక్తులకు, యువసేన సభ్యులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.