janodaya.in
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 5:22 pm Digital Edition : JANODAYA MEDIA

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాల అమలు – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జనోదయ, గంగాధర, ఏప్రిల్ 8:

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఇస్లాంపూర్, కోట్ల నరసింహులపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గర్శకుర్తిలో రూ.10 లక్షలు, వెంకంపల్లిలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

అదేవిధంగా ఇస్లాంపూర్, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్, చర్లపల్లి (ఎన్), బూరుగుపల్లి, కోట్ల నరసింహులపల్లి, గర్శకుర్తి, కురిక్యాల, గట్టుభూత్కూర్ తదితర గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వశక్తి సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కనీసం గ్రామపంచాయతీలకు సొంత భవనాలను కూడా నిర్మించలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

మహిళల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో మహిళలు సమావేశాలు నిర్వహించుకునేలా స్వశక్తి సంఘ భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచులు రామిడి రాజిరెడ్డి, బారాజు ప్రభాకర్ రెడ్డి, వేముల భాస్కర్, గుండా వేణి లావణ్య తిరుపతి, ఎడవెల్లి విజయ, కాడరి రేణుక కనకయ్య, రాచమల్ల రవి, దూలం కల్యాణ్, గునుకొండ బాబు, రెండ్ల శ్రీనివాస్, బాసవేణి శ్రీనివాస్, దానే అనసూర్య ఒదేలు, బాబ లక్ష్మి మధు, కవిత మల్లేశం, బిర్ల ఆనందం, అరే రాజశేఖర్, నాయకులు దుబ్బాసి బుచ్చయ్య, కర్ర విద్యాసాగర్ రెడ్డి, మేర్జ కొండయ్య, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.