జనోదయ, వెల్గటూర్, మార్చి 17:
ధర్మపురి పట్టణం మరోసారి మనసును కలిచివేసే ఘటనకు వేదికైంది. ప్రేమతో మొదలైన ఓ దాంపత్య జీవితం, చివరకు పాశవిక చర్యకు దారి తీసి, ద్వేషం – కోపం – అసహనంతో విషాదాంతానికి చేరుకోవడం సమాజాన్ని ఆలోచనలో పడేస్తోంది.కుటుంబం అనేది పరస్పర విశ్వాసం, అర్థం చేసుకోవడం మీద నిలబడాల్సిన పునాది కాగా, కోపం అంధత్వంగా మారినప్పుడు అది ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసింది. పట్టణంలోని స్థానిక ఐదో వార్డులో నివసిస్తున్న ఈ యువ జంట మధ్య గత కొంతకాలంగా చిన్నచిన్న గొడవలు చోటుచేసుకుంటూ వచ్చాయి. ఇటీవల కాలంలో కలహాలతో నిండిపోయిన ఈ యువ జంట మధ్య , మార్చి 16న జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, భర్త కోపావేశంలో నియంత్రణ కోల్పోయాడు. పెట్రోల్ తీసుకువచ్చి భార్యపై చల్లి నిప్పంటించడం వంటి అమానుష చర్యకు దిగాడు.మంటల్లో కాలిన యువతిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రాణాల కోసం పోరాడుతుండగా, ఈ ఘటన ప్రతి మనిషి ..మనసును కలిచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు…ఇది సమాజానికి గట్టి హెచ్చరిక అని పలువురు అభిప్రాయం . కోపం క్షణికమైనదే అయినా, దాని ఫలితం శాశ్వతమైన నష్టం. మనుషుల మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం లేకపోతే సంబంధాలు అగ్నిపర్వతాలుగా మారతాయని ఇది చాటి చెబుతోంది. ఇంటి తగాదాలు నిప్పులుగా మారక ముందే మాటలతో ఆర్పి ..అసహనం పెరిగే ముందు సహనం పెంచాలి…ప్రేమతో ప్రారంభమైన బంధం, కోపంతో ముగియకుండా కాపాడుకోవాలి .మానవత్వం మంటల్లో కాలిపోకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.