janodaya.in
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 2:14 pm Digital Edition : JANODAYA MEDIA

జిపిఎస్, ఆన్లైన్, ట్రక్ షీట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

వడ్లు కొనమంటే అడ్డమైన కోర్రీలా

కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే అపార నష్టం

ఆంక్షలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోలు పూర్తి చేయాలి

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా

చొప్పదండి, ఏప్రిల్ 28 (జనోదయ):

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొత్త నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చొప్పదండి పట్టణంలో రైతులు, బిఆర్ఎస్ నాయకులు కలిసి నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులు, బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ధాన్యం లిఫ్టింగ్‌కు ఆన్లైన్ ట్రక్ రిజిస్ట్రేషన్, జీపీఎస్ విధానం వంటి కొత్త నిబంధనలు రైతులకు భారంగా మారుతున్నాయని అన్నారు. ట్రాక్టర్‌కు జీపీఎస్ తప్పనిసరి చేస్తే ఒక్కో ట్రాక్టర్‌కు రూ.4 వేల వరకు అదనపు ఖర్చు వస్తుందని, ఇది రైతులపై మరింత ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు.

కొత్త విధానాల వల్ల ఒక్కో కొనుగోలు కేంద్రంలో వడ్ల ఎత్తివేతకు రెండు నెలల వరకు సమయం పట్టే ప్రమాదం ఉందని, ఈ లోగా అకాల వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు మరింత ఇబ్బందులు కలిగిస్తాయని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లు రైతులకు శాపంగా మారాయని, కేంద్రాలు సకాలంలో స్పందించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నాయని ఆరోపించారు.

వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ విధానం తప్పనిసరి చేయాలనే నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమల్లో ఉన్న పాత విధానాన్ని కొనసాగిస్తూ, వర్షాలు రాకముందే కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వంను హెచ్చరించారు.