janodaya.in
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 2:32 pm Digital Edition : JANODAYA MEDIA

మంథనిలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అంత్యక్రియలు:మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ నివాళులు

🔹రాంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్,సుద్దాల దేవయ్య,కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్

🔹రాంరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపిన మాజీ మంత్రులు

జనోదయ,పెద్దపల్లి/మంథని ఫిబ్రవరి 5:

మంథని రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అకాల మరణం మంథని నియోజకవర్గ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది.బుధవారం మంథనిలో ఆయన అంతక్రియలు గంభీర వాతావరణంలో,కన్నీటి మధ్య ఘనంగా జరిగాయి.ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడిని కోల్పోయిన దుఃఖం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించింది.

ఈ అంత్యక్రియలకు రాజకీయ,సామాజిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై రాంరెడ్డికి అంతిమ నివాళులర్పించారు.ముఖ్యంగా మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్,సుద్దాల దేవయ్య,అలాగే కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్ పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.వారి మాటల్లో కేవలం రాజకీయ సహచరుడిని కోల్పోయిన బాధ మాత్రమే కాదు,ఒక ఆత్మీయుడిని కోల్పోయిన వేదన స్పష్టంగా వ్యక్తమైంది.

మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ భావోద్వేగం

ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ మాట్లాడుతూ—రాంరెడ్డితో తనకు ఉన్న సుదీర్ఘ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనేక సందర్భాలు,కలిసి పనిచేసిన రోజుల జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు నిలిచాయని చెప్పారు. “నిజాయితీ,క్రమశిక్షణ,మాట నిలబెట్టుకునే తత్వం రాంరెడ్డి గారి అసలైన బలం.ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య స్మరణ

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ,రాంరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ,ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహబంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.కలిసి గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ,“ఆయన మాటలో స్పష్టత,నిర్ణయాల్లో దృఢత్వం ఉండేది.అలాంటి నాయకుడు ఇక లేడన్న నిజం జీర్ణించుకోలేనిది” అంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్ మాటల్లో వేదన

కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్ మాట్లాడుతూ, “ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవించాం. ఈరోజు ఇలా జరగడం మనసును కలిచివేస్తోంది. రాంరెడ్డి చేసిన సేవలు మంథని ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి” అంటూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.

ప్రజాసేవకు అంకితమైన జీవితం

చందుపట్ల రాంరెడ్డి రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమైనది.అధికారంలో ఉన్నా,లేకపోయినా ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమించిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారు.వ్యక్తిగత జీవితంలో సాదాసీదా స్వభావం,రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి ఆయనకు ప్రజల్లో విశేష గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

ఈ దుఃఖసమయంలో ఆయన కుటుంబానికి కలిగిన లోటు మాటల్లో చెప్పలేనిది.చందుపట్ల రాంరెడ్డి శారీరకంగా మన మధ్య లేకపోయినా,ఆయన ఆశయాలు,ఆయన చేసిన సేవలు మంథని ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.