janodaya.in
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 1:16 pm Digital Edition : JANODAYA MEDIA

గౌడ కమ్యూనిటీ హాల్‌కు స్థలం కోరుతూ వినతి

🔹ఎమ్మెల్యే విజయరామణారావును కలిసిన గౌడ నేతలు

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 4:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్‌తో పాటు గౌడ విద్యార్థుల కోసం వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గౌడ సంఘాల ఐక్య వేదిక నాయకులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 80 వేల మందికి పైగా గౌడ సామాజిక వర్గీయులు నివసిస్తున్నారని, వారిలో అధిక శాతం మంది గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం వల్ల శుభకార్యాలు, సామాజిక సమావేశాలు నిర్వహించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే జిల్లా కేంద్రం సహా పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలల్లో చదువుతున్న గౌడ విద్యార్థులకు వసతి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఘవాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 1072లో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కమ్యూనిటీ హాల్, విద్యార్థి వసతి గృహాల నిర్మాణానికి కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చిప్ప రాజమౌళి గౌడ్,మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్,మాజీ జడ్పిటిసి గోపగోని సారయ్య గౌడ్,బాలసాని వెంకటేశం గౌడ్,సింగం సత్తయ్య గౌడ్,పడాల కొమురయ్య గౌడ్,కోల లక్ష్మణ్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.గౌడ సమాజానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.