janodaya.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 6:23 pm Digital Edition : VAMSHI PADALA

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత

🔹నిర్భయంగా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

🔹పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు

🔹ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

🔹 పెద్దపల్లిలో పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి

🔹పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6:

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని,ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం,ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,శాంతినగర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల పరిసరాలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.అక్కడ అమలులో ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, మరింత కట్టుదిట్టంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు.అనంతరం ఎస్సైలు,సీఐలు,ఏసీపీలు,డీసీపీతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలని,సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా,అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే,వారి మీద కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు,అక్రమ ప్రలోభాలు,బెదిరింపులకు పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ భద్రతా పరిశీలన కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, ఏసీపీ జి.కృష్ణ,సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్సై లక్ష్మణ్ రావు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.మొత్తంగా ఎన్నికలు శాంతియుతంగా సజావుగా సాగేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందనే నమ్మకాన్ని ఈ చర్యలు మరింత బలపరిచాయి.