janodaya.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 8:32 pm Digital Edition : VAMSHI PADALA

పని ప్రదేశాల్లో మహిళా భద్రతకు చట్టబద్ధ రక్షణ: జిల్లా సహాయ కార్మిక అధికారి హేమలత

🔹అంతర్గత ఫిర్యాదుల కమిటీలు తప్పనిసరి

🔹చట్టాన్ని అమలు చేయని సంస్థలపై జరిమానా

🔹షీ బాక్స్ పోర్టల్‌లో కమిటీ వివరాల నమోదు అనివార్యం

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6:

పెద్దపల్లిలో మహిళా కార్మికుల భద్రతపై కీలక ప్రకటన వెలువడింది.పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (Internal Complaints Committees – ICC) ఏర్పాటు చేయాలని సహాయ కార్మిక అధికారి కే.హేమలత స్పష్టం చేశారు.శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె,చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని గుర్తు చేశారు.

పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు రంగం సహా సంఘటిత,అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న మహిళల భద్రతకు ఈ చట్టం బలమైన రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న అన్ని వ్యాపార,వాణిజ్య,పారిశ్రామిక సంస్థలు,దుకాణ సముదాయాలు తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా,కమిటీ సభ్యుల పేర్లు,వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SheBox వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని హేమలత తెలిపారు.ఇది మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.ఈ నిబంధనలను పాటించని సంస్థల యాజమాన్యంపై చట్టప్రకారం జరిమానాలు విధించబడతాయని ఆమె హెచ్చరించారు.

మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా,సామాజిక బాధ్యత కూడా అని హేమలత స్పష్టం చేశారు.అన్ని సంస్థలు చట్టాన్ని గౌరవిస్తూ తక్షణమే అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి,మహిళలకు భద్రమైన,గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.