janodaya.in
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:25 am Digital Edition : JANODAYA MEDIA

చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్ల విడుదల..మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలిచింది : పిల్లి చంద్రశేఖర్ పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు 

జనోదయ, కమాన్‌పూర్, ఆగస్టు 5:

తెలంగాణ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల నిల్వ (స్టాకింగ్) కోసం అదనంగా రూ.116 కోట్లు విడుదల చేయడాన్ని మంథని నియోజకవర్గ మత్స్యకారులు స్వాగతించారు. ఈ నిర్ణయం మత్స్యకార కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో కమాన్‌పూర్ మత్స్యకార సహకార సంఘం, మంథని నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కోసం రూ.116 కోట్లు విడుదల చేయడం మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడంతో పాటు వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. విడుదలైన నిధులతో జిల్లాలోని చెరువులు, జలాశయాల్లో సకాలంలో నాణ్యమైన చేప పిల్లలను వదిలి పథకం ప్రయోజనాలు ప్రతి మత్స్యకార కుటుంబానికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసి ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కమాన్‌పూర్ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి మాట్లాడుతూ, చెరువుల్లో సకాలంలో నాణ్యమైన చేప పిల్లలను వదిలితే మత్స్య ఉత్పత్తి పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పారదర్శకంగా వినియోగించి, ప్రతి చెరువులో సమయానికి చేప పిల్లలను వదిలేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అనవేని సదానందం, పిడుగు భీమలింగు, అనవేని సదయ్య, గోగుల శ్రీను, చుంచు శ్రీను, రాసకొండ మొగిలి, కారుపాకల రవితేజ, అనవేని అనిల్, చొప్పరి వీరయ్య, గోగుల లక్ష్మీరాజం, రాసకొండ పెద్ద లక్ష్మీరాజం, రాసకొండ సమ్మయ్య, అనవేని లక్ష్మీరాజం, పిల్లి రమేష్, మబ్బు నరసయ్య, మబ్బు శంకర్, పిల్లి శంకర్, గడప సారయ్య, పెద్దపల్లి కుమార్, చొప్పరి సదయ్య, కందుల నర్సింగం, పిడుగు మల్లేష్‌తో పాటు కమాన్‌పూర్ మత్స్యకార సహకార సంఘం, ముదిరాజ్ సంఘం నాయకులు, మత్స్యకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.