## గంగాధర గురుకులంలో అర్ధరాత్రి ఘర్షణ
### బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎంఆర్ఓ
### పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన – 10వ తరగతి విద్యార్థులపై కఠిన చర్యల డిమాండ్
గంగాధర, ఏప్రిల్ 4 (జనోదయ):
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటనపై వివాదం మరింత ముదిరింది. సంఘటనపై స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఎంఆర్ఓ, బాధ్యులైన విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది పాత్రపై విచారణ అనంతరం సస్పెన్షన్ లేదా బదిలీ వంటి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అయితే, రాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం ఆలస్యంగా బయటకు రావడంతో తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెరిగింది. సంఘటన జరిగిన తర్వాత కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాల వద్దే తల్లిదండ్రులు నిలిచి తమ పిల్లల పరిస్థితిపై ఆరా తీశారు.
ఇక 10వ తరగతి విద్యార్థుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయా? పర్యవేక్షణలో నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
మరోవైపు, సంఘటనపై పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టడం, జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. సమాచారం బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై గురుకుల పాఠశాల యాజమాన్యం మరియు పోలీస్ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.