మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
పెద్ద పెద్ద డైలాగులతో కాలం వెళ్లదిస్తున్న చొప్పదండి చుట్టం ఇక్కడి ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర:
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు సకాలంలో నీళ్లు, యూరియా, రైతు బందు కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ఉన్నారని, ఎండలు ముదిరి పంటలు ఎండిపోయి, రైతులు ఆందోళన చెందుతున్న నీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు.
గంగాధరమండలం గోపాల్ రావ్ పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి, పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గం లో అనేక ప్రాంతాలలో సకాలంలో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆందోళన చెందుతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న దద్దమ్మ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నారాయణపూర్ కుడి కాల్వ పనులు మా బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేశామని, దానిద్వారా, ఆ పరివాహక ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చే సోయి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కొండాపూర్ మైసమ్మ చెరువు నింపి డి4 కాలువ ద్వారా ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలని, ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుబంధు అంశంపై నిర్ణయం తీసుకుంటారని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వారికి మొండి చేయి చూపించారు. ఇప్పటివరకు మూడు దఫాలుగా మీరు ఎగ్గొట్టిన రైతుబంధు 27 వేల కోట్లు అని, చొప్పదండి నియోజకవర్గం చుట్టం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్ద పెద్ద డైలాగులతో కాలం వెళ్ల దిస్తున్నాడే తప్ప ఆయన వల్ల చొప్పదండి నియోజకవర్గం పెద్ద ఒరిగిందేమీ లేదు. ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వనని భారీ డైలాగులు కొట్టిన నువ్వు క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్లి పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించావా అని ఏద్దేవా చేశారు. ఫోటోలకు ఫోజులు కొట్టుడు తప్ప నీవల్ల నియోజకవర్గానికి ఒక్క రూపాయి లాభం లేదని చురుకలు అంటించారు. ఇప్పటికైనా సకాలంలో ఎండిపోయిన పంటపొరులకు ఎకరానా 25000వేల చొప్పున నష్ట పరిహారం అందించి, నీళ్లు ఇచ్చి, రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో రైతులతో కలసి వారి పక్షాన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.