janodaya.in
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 7:59 pm Digital Edition : VAMSHI PADALA

కమాన్‌పూర్‌లో దోమల నివారణ చర్యలు ప్రారంభం: సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్

🔹దోమల మందు స్ప్రేకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

🔹నిల్వ నీటిపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపు

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 7:

ఫిబ్రవరి–మార్చి నెలల్లో దోమల ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం దోమల నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ స్వయంగా దోమల మందు స్ప్రే కార్యక్రమాన్ని ప్రారంభించి,ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నవంబర్ నుంచి జనవరి వరకు అనుకూల వాతావరణంలో దోమల గుడ్లు పెద్ద సంఖ్యలో ఏర్పడతాయని,అవి ఫిబ్రవరి–మార్చిలో పక్వానికి చేరుకుని దోమల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుందని వివరించారు.ఉష్ణోగ్రతలు పెరగడం,ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు ఉండటం వల్ల దోమలు వేగంగా విస్తరిస్తాయని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సర్పంచ్,ఇంటి చుట్టూ నిల్వ నీటిని తొలగించడం,ప్రతి వారం డ్రైడే పాటించడం,కాలువలు,డ్రైనేజీలను శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల పెరుగుదలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ముందస్తు జాగ్రత్తలే డెంగ్యూ,మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి రఫీక్ సోహెల్,వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని దోమల నివారణకు ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. గ్రామవ్యాప్తంగా ఈ చర్యలు కొనసాగుతాయని తెలిపారు.