సమ్మక్క–సారలమ్మ జాతర… భక్తి, నమ్మకానికి ప్రతీక.
జనోదయ మేడారం :
సమ్మక్క–సారలమ్మ జాతరలో తమ కోరికలను చిట్టీల రూపంలో అమ్మవారికి తెలియజేయడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆనవాయితీ. భక్తి, నమ్మకం, కుటుంబ రక్షణ—ఇవే ఆ చిట్టీల్లో ప్రతిబింబించేవి.
కానీ ఈసారి జరిగిన జాతరలో ఒక సంఘటన మనసును కలిచివేసింది.
ఒక తల్లి—“నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి అమ్మా” అంటూ కన్నీళ్లతో చిట్టి వేసింది.
అదే సమయంలో ఆ కొడుకు—“తల్లి ఆస్థి మొత్తం నాకు దక్కాలి” అంటూ మరో చిట్టి వేసాడు.
ఇది చదివినప్పుడు ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది—
ఇక్కడ ఎవరు ఓడిపోయారు? తల్లినా? కొడుకా? లేక మనుషుల విలువలేనా?
ఇప్పటి రోజుల్లో మానవ సంబంధాలు క్రమంగా శూన్యంగా మారుతున్నాయి.
తల్లి–తండ్రి ప్రేమకంటే ఆస్తి విలువ పెరిగిపోయింది.
బంధాలకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం అయింది.
రక్త సంబంధాలకంటే రిజిస్ట్రేషన్ పేపర్లు ప్రాధాన్యం పొందుతున్నాయి.
ఒకప్పుడు తల్లి ఆశీర్వాదం సంపదగా భావించేవారు.
ఇప్పుడు తల్లి ఆస్తినే ఆశీర్వాదంగా భావిస్తున్నారు.
డబ్బు అవసరం—అవును.
కానీ డబ్బే జీవితమైపోతే, మనుషుల మధ్య ఉన్న మానవత్వం ఎక్కడ నిలుస్తుంది?
ఈ సంఘటన ఒక తల్లి–కొడుకు కథ మాత్రమే కాదు.
ఇది నేటి సమాజానికి అద్దం.
భక్తి మందిరాల్లో కూడా స్వార్థం చిట్టీలుగా మారుతున్న దుర్దశకు నిదర్శనం.
అమ్మవారు కోరేది ఆస్తులు కాదు…
అమ్మవారు కోరేది మనసుల్లో మానవత్వం.
అది మరిచిపోయిన రోజే—మన నిజమైన పేదరికం మొదలైంది.