janodaya.in
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 11:34 am Digital Edition : VAMSHI PADALA

అమరజీవి వీరస్వామి ఆదర్శప్రాయుడు : పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిల్లి శేఖర్

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 11: 

ఏకశిల ఫొటో స్టూడియో అండ్‌ ఫ్రేమ్‌ వర్క్స్‌ నిర్వాహకుడు, ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ చందనాల వీరస్వామి సమాజానికి చేసిన సేవలు, ఆయన నిరాడంబర జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కమాన్‌పూర్‌ మాజీ ఎంపీటీసీ,పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిల్లి శేఖర్ కొనియాడారు. ఈ నెల 1న మృతిచెందిన వీరస్వామి 11వ రోజు దినకర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులు, స్థానికుల ఆధ్వర్యంలో ఏకశిల ఫొటో స్టూడియో ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సంతాప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిల్లి శేఖర్ మాట్లాడుతూ, వీరస్వామి కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా సమాజహితం కోరుకునే సౌమ్యుడు, సేవాభావం కలిగిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారని గుర్తుచేశారు. మరణానంతరం తన నేత్రాలను దానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడం అత్యంత గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన నేత్రదానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

స్థానిక వ్యాపారులు, ప్రముఖులు మాట్లాడుతూ వీరస్వామి మృతి స్థానిక సమాజానికి, వ్యాపార వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తెలిపారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, మిత్రులు తదితరులు పాల్గొని వీరస్వామికి ఘన నివాళులర్పించారు.